*రైతు పండించినవరి ధాన్యానికి మద్దతు ధర కల్పించాలి..* *కొనుగోలుదారుల దోపిడీని అరికట్టాలి.* *సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్.*
సూర్యాపేట: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కు ధాన్యం తీసుకొస్తున్న రైతులకు తక్షణమే కనీస మద్దతు ధర కల్పించి, కొనుగోలుదారుల దోపిడీని అరికట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రైతులు ఆరుగాలం శ్రమించి, పెట్టుబడులు పెట్టి పండించిన వరి ధాన్యాన్ని మార్కెట్కు తీసుకొస్తే కనీస ధర కూడా దక్కని పరిస్థితి నెలకొనడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.గత వారం రోజులుగా సూర్యాపేట మార్కెట్కు వరి ధాన్యం వస్తున్నప్పటికీ, రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. క్వింటా ధాన్యానికి గతంలో రూ.3,500 వరకు ధర పలుకుతుండగా, గురువారం ఒక్కసారిగా రూ.2,000కే కొనుగోలు చేయడం రైతులను తీవ్ర నష్టాల్లోకి నెట్టడమేనన్నారు. ధర ఇంత భారీగా పడిపోవడానికి కొనుగోలుదారుల మధ్య కుమ్మక్కు, సిండికేట్ వ్యవహారాలే కారణమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు, సాగునీటి వ్యయాలు రోజురోజుకూ పెరుగుతున్నా, పండించిన పంటకు మాత్రం గిట్టుబాటు ధర దక్కడం లేదని నాగార్జున రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి సాగు చేసిన రైతులు మార్కెట్కు ధాన్యం తీసుకొచ్చిన తర్వాత కొనుగోలుదారులు చెప్పిన ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వాలు రైతుల ఆదాయాన్ని పెంచుతామని ప్రకటనలు చేయడమే తప్ప, క్షేత్రస్థాయిలో రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.రైతులకు కనీస మద్దతు ధర అందేలా చూడాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు, మార్కెట్ యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. కొనుగోలుదారులు సిండికేట్గా ఏర్పడి ధరలను తగ్గిస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన అధికారులు తమ బాధ్యతను విస్మరిస్తే ఎలా సహిస్తారని ప్రశ్నించారు.క్వింటా ధాన్యానికి రూ.3,500 వరకు ధర ఉన్న పరిస్థితి నుంచి ఒక్కసారిగా రూ.2,000కు తగ్గించి కొనుగోలు చేస్తున్న వ్యవహారంపై అధికారులు తక్షణమే స్పందించాలని నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. ధరల తగ్గింపునకు కారణాలను విచారించి, సిండికేట్గావ్యవహరిస్తున్నట్లు తేలిన కొనుగోలుదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారి లైసెన్సులను రద్దు చేయాలని కోరారు. మార్కెట్లో పారదర్శకమైన కొనుగోలు విధానాన్ని అమలు చేసి, రైతులకు కనీస మద్దతు ధర అందేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. సూర్యాపేటవ్యవసాయ మార్కెట్ లో దోపిడి కొన్ని సంవత్సరాలుగా యతీర్చగా కొనసాగుతుందన్నారు.
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో రైతులు తీసుకొచ్చిన వరి ధాన్యాన్ని తక్షణమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, ధరల పతనంపై విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే స్పందించి కొనుగోళ్లను క్రమబద్ధీకరించకపోతే రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రైతుల శ్రమను, చెమటను కొనుగోలుదారులు దోచుకుంటుంటే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు.