జ్ఞానంతోనే మనిషి జీవితంలో మార్పు: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట :
జ్ఞానంతోనే మనిషి జీవితంలో గొప్ప మార్పు సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మహర్షి వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా సమీకృత కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సాధారణ జీవితం నుంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి జ్ఞానం ఎంతో అవసరమని కలెక్టర్ చెప్పారు. జ్ఞానాన్ని సంపాదించడంతో పాటు దానిని ఆచరణలో పెట్టినప్పుడే వ్యక్తిగతంగా, సామాజికంగా మార్పు సాధ్యమవుతుందని తెలిపారు. మనలో మార్పు వస్తే సమాజంలోనూ మార్పు వస్తుందని పేర్కొన్నారు.
**కరుణ, దయ ముఖ్యమైన విలువలు**
మహర్షి వాల్మీకి జీవితం నుంచి కరుణ, దయ వంటి గొప్ప విలువలను నేర్చుకోవాలని కలెక్టర్ సూచించారు. మనుషులతో పాటు పశుపక్ష్యాదులకు కూడా ఈ ప్రపంచంలో జీవించే హక్కు ఉందని చెప్పారు. ప్రతి జీవిపై ప్రేమ, దయతో వ్యవహరించాలని, మానవత్వాన్ని జీవితంలో భాగంగా చేసుకోవాలని కోరారు. వేల సంవత్సరాల క్రితం వెలుగులోకి వచ్చిన రామాయణం నేటికీ ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తోందని అన్నారు. కాలంతో పాటు సాంకేతికత మారుతున్నా, మానవ విలువలు మాత్రం శాశ్వతంగా ఉంటాయని చెప్పారు. భారతీయ సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకుంటూ భావితరాలకు అందించాలని సూచించారు.ప్రతి ఒక్కరూ తమలోని చెడు లక్షణాలను తగ్గించుకుంటూ మంచి గుణాలను పెంపొందించుకోవాలని అన్నారు. అప్పుడే జిల్లా, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.హరి సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి ప్రేమ్ రాజ్, బీసీ వెల్ఫేర్ అధికారి విశాల్, జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ అధికారి పెండెం వెంకటరమణ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.