*హైకోర్టు ఉత్తర్వులతో వజ్ర రైస్ మిల్ పునఃప్రారంభానికి సిద్ధం* రైతులకు మద్దతు ధర అందించడమే లక్ష్యం *వట్టే జానయ్య యాదవ్*
సూర్యాపేట:
రైతుల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన వజ్ర రైస్ మిల్ను తిరిగి ప్రారంభించేందుకు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, అధికారులు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తున్నారని బీసీ ఉద్యమ నాయకుడు వట్టే జానయ్య యాదవ్ ఆరోపించారు. బుధవారం సూర్యాపేట మండల పరిధిలోని బాలెంల గ్రామం వద్ద గల వజ్ర రైస్ మిల్లులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
గత మూడు నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం, విజిలెన్స్ అధికారుల కేసులు, ఆరోపణలపై తాము హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు. ఈ వ్యవహారంలో కుటుంబ సభ్యులతో పాటు మిల్ సిబ్బందిని కూడా జైలుకు పంపించారని పేర్కొన్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి మిల్లును నడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అధికారులు సహకరించడం లేదని విమర్శించారు.
రైతులకు అండగా నిలవాలనే ఉద్దేశంతోనే రైస్ మిల్ ఏర్పాటు చేశామని, కేవలం వ్యాపారం చేయడమే తమ లక్ష్యం కాదని, రైతులకు మద్దతు ధర అందించడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే తమ ఉద్దేశమని వట్టే జానయ్య యాదవ్ స్పష్టం చేశారు.
గత మూడు నెలలుగా మిల్లింగ్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో సుమారు 1,500 మంది ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం ఎక్కువ కాలం నిల్వ ఉండటంతో పాడయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
2022–23 టెండర్ ధాన్యానికి సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉందని, దానిపై న్యాయస్థానం నుంచి ఇంకా ఉత్తర్వులు వెలువడలేదని తెలిపారు. తమపై నమోదైన కేసులపై పునర్విచారణ జరపాలని కోర్టు ఆదేశించిందని పేర్కొన్నారు.
రైతులను భయపెట్టి, మిల్లును తాళం వేసి కార్యకలాపాలు నిలిపివేయడం సరికాదని అన్నారు. మిల్లును నిర్వహించకుండా అడ్డుకునే అధికారం అధికారులకు, పోలీసులకు లేదని ఆయన వ్యాఖ్యానించారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో అధికారులు సహకరించాలని, లేకపోతే కోర్టు ధిక్కరణకు సంబంధించిన పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న దళారులు రైతుల వద్ద తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారని ఆరోపించిన ఆయన, రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రేపటి నుంచి వజ్ర రైస్ మిల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని వట్టే జానయ్య యాదవ్ ప్రకటించారు. రాజకీయ స్వార్థం కోసం రైతులకు మద్దతు ధర అందించే మిల్లులపై కుట్రలు చేయడం మానుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్కు అధికారం అప్పగించిన ప్రజలకు, ప్రస్తుత ప్రభుత్వ చర్యలు కూడా నిరాశ కలిగిస్తున్నాయని విమర్శించారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరారు. రైతులకు మద్దతు ధర అందే వరకు, వజ్ర రైస్ మిల్ సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని వట్టే జానయ్య యాదవ్ స్పష్టం చేశారు.