*బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక* *కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో బతుకమ్మను పేర్చిన డీసీసీ కోశాధికారి కక్కిరేణి శ్రీనివాస్*
సూర్యాపేట: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అని డీసీసీ కోశాధికారి కక్కిరేణి శ్రీనివాస్ అన్నారు. ఎంగిలిపూల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని తన తల్లి, చెల్లి, బావ, భార్య, బిడ్డతో కలిసి తన ఇంట్లో బతుకమ్మను పేర్చే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగ ప్రకృతితో మమేకమైన గొప్ప సంప్రదాయమని పేర్కొన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, వాటి చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ, ఆటపాటలతో సంబరాలు జరుపుకోవడం తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందన్నారు.
పండుగ సందర్భంగా తెలంగాణలోని మహిళలు, యువతులు కాలనీలు, కూడళ్లు, గ్రామాలు, చెరువుల వద్ద పెద్ద సంఖ్యలో ఒకచోట చేరి బతుకమ్మ ఆడుతూ సందడి చేస్తారని తెలిపారు. పూలను పూజిస్తూ ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే ఈ పండుగ తెలంగాణ ప్రజల జీవన విధానంలో విడదీయలేని భాగమని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులందరితో కలిసి బతుకమ్మను పేర్చడం ఆనందాన్ని కలిగించడంతోపాటు కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా ప్రజలకు, తెలంగాణ ఆడపడుచులకు కక్కిరేణి శ్రీనివాస్ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో, సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.